తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, పార్లమెంట్‌లో బుధవారం జరిగిన దాడి తరహా ఘటన చోటు చేసుకున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి ఛైర్మన్, ప్రొటెం స్పీకర్.. పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయాలని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలని ప్రొటెం స్పీకర్ ఆదేశించారు.
Parliament effect: tight security for telangana assembly sessions
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. డిసెంబర్ 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. 16న అసెంబ్లీలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
మంత్రుల బాధ్యతల స్వీకరణ: కేబినెట్ భేటీ
గురువారం సచివాలయంలో తమ ఛాంబర్లలో భాద్యతలు స్వీకరించనున్నారు పలువురు మంత్రులు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉదయం 7.30 గంటలకు, దామోదర రాజ నరసింహ ఉదయం 9 గంటలకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 9 గంటలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు, అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం
తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే, ఒకే ఒక నామినేషన్ రావడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
శాసనసభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు.
కాగా, ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
సభాపతిగా ప్రసాద్ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానుండటం విశేషం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు
