తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ వరుస నిర్ణయాలను ప్రకటిస్తోంది. తాజాగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ విజయశాంతికి ఎన్నికల వేళ ముఖ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా పార్టీలో క్రియాశీలకంగా పని చేసి..సీట్లు దక్కని నేతలకు ప్రాధాన్యత కల్పించింది. ఇక ప్రచారాన్ని మరింత తీవ్ర తరం చేసేందుకు నిర్ణయించింది.
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార..ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రచార…ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ బాధ్యతలను తాజాగా పార్టీలో చేరిన విజయశాంతికి అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదంరెడ్డి, నరేందర్ రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్ ను నియమించారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు తెలంగాణలో మకాం వేసారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ పది రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
బీజేపీలో క్రియాశీలకంగా పని చేసిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కొంత కాలంగా బీజేపీ నుంచి విజయశాంతి బయటకు వస్తారని..కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ, విజయశాంతి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. వచ్చే లోక సభ ఎన్నికల్లో పోటీకి పార్టీ నుంచి హామీ దక్కినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్ అభ్యర్దిగా మెదక్ నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ప్రచారం కొనసాగుతున్న వేళ..ప్రచార -ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ బాధ్యతలను విజయశాంతికి అప్పగించటం ద్వారా పార్టీలో ప్రాధాన్యత ఏంటో స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
