తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని, త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 87 స్థానాలలో తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించిన టిడిపి మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు.
మేనిఫెస్టో ఊసే లేదు.
టిడిపి అధినేత చంద్రబాబు జైల్లో ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ సమయంలో తెలంగాణ టిడిపి బాలకృష్ణ పైనే బోలెడు అసలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రజా క్షేత్రంలోకి దూకుడుగా వెళ్లనప్పటికీ, తమ పార్టీ కోసం నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రచారం చేస్తారని టిడిపి భారీ అంచనాలలో ఉంది.
తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చంద్రబాబు బెయిల్ పై విడుదల అయితే, ఆ తరువాత యుద్ధ ప్రాతిపదికన బీ ఫారాలు ఇవ్వాలని భావిస్తున్నారు కానీ, చంద్రబాబు విడుదల ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఈ క్రమంలో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. దీంతో ఏం చేయాలన్నా భారమంతా బాలకృష్ణ పైనే పెట్టాలని తెలంగాణ టిడిపి భావిస్తుంది.
బాలయ్య బాబు ప్రచారం చేస్తే టిడిపికి జవసత్వాలు వస్తాయని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలలో, శ్రేణులలో జోష్ వస్తుందని భావిస్తున్నారు. అయితే బాలయ్య పైన గంపెడాశలు పెట్టుకున్నప్పటికీ, ప్రచారం చేసినప్పటికీ ఫలితం మాత్రం ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న.
ఎందుకంటే 2018 ఎన్నికల్లో బాలకృష్ణ తన సోదరుడు కుమార్తె అయిన నందమూరి సుహాసిని పోటీ చేసిన కూకట్పల్లి నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు ప్రచారం చేశాడు. అయినప్పటికీ నందమూరి సుహాసిని అక్కడ ఓటమిపాలయ్యారు. ఇక ప్రస్తుతం తమతో పాటు జనసేన కలిసి ముందుకు సాగుతుంది అనుకున్న టిడిపి, జనసేన బీజేపీలు మంతనాలు జరపడంతో బాలకృష్ణ పైనే ఆధారపడింది. బాలకృష్ణ ప్రచారం చేస్తే పార్టీ గెలుపు విషయం పక్కన పెడితే, బాలయ్య బాబు తిరిగితే అయినా పార్టీ తెలంగాణలో ఉంది అన్నది అర్థమవుతుంది.
