కృష్ణా నదీ జలాల పంపకాల వ్యవహారం ఎన్నికల వేళ కాక రేపుతోంది. తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణానదీ జలాల పునఃపంపకం వ్యవహారాన్నికెలికిన కేంద్రం..
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు మరిన్ని పరిశీలనాంశాల్ని కేటాయించింది. దీంతో వాటిపై ముందడుగు వేసేందుకు ఇవాళ కృష్ణా ట్రైబ్యునల్ ఢిల్లీలో సమావేశమవుతోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అదనపు అధికారాలు ఇవ్వడం ద్వారా కృష్ణా నదీ జలాల పునఃపంపకానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో వాదించింది.
2014 నాటి ఏపీ విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపులకు రక్షణ ఉందని, కేంద్రం చర్యతో ఇప్పుడు బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ పునఃపంపకాలు చేపడితే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్లో పేర్కొంది. విభజన చట్టంలోని సెక్షన్ 89ఏ, బీ కింద బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల్ని ప్రాజెక్టుల వారీగా కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ఈ సమయంలో అదనపు పరిశీలనాంశాలు ఇవ్వడం తగదని ఏపీ వాదిస్తోంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి చర్చించేందుకు ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇవాళ విచారణ జరపబోతోంది. ఇందులో చర్చించే అంశాలపై పూర్తి స్పష్టత లేకపోయినా కేంద్రం తాజాగా కేటాయించిన అంశాలు కాకుండా ఇప్పటికే ఉన్న అంశాలపైనే ట్రైబ్యునల్ విచారణ జరిపి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ విచారణను రెండు వారాలు వాయిదా వేయాలని ఏపీ ఇప్పటికే కోరింది. అయితే ఏపీ వినతిపై ట్రైబ్యునల్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
