ఇజ్రాయెల్ లో భారతీయుల్ని వెనక్కి తెచ్చేందుకు ఆపరేషన్ అజయ్ ప్రారంభం..

ఇజ్రాయెల్ పై పాలస్తీనా ఉగ్రవాద సంస్ధ హమాస్ మెరుపుదాడులు, అనంతరం ఇజ్రాయెల్ నుంచి కౌంటర్ దాడులు వెనువెంటనే మొదలుకావడంతో అక్కడ వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

వీరంతా దాడుల కారణంగా బయటికి రాలేక, అలాగే ఇళ్లలో ఉండిపోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో వీరిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా భారత్ ఇవాళ “ఆపరేషన్ అజయ్” పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించింది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో అక్కడ చిక్కుకున్న తమ ప్రజలను స్వదేశానికి తీసుకురావడానికి లేదా కనీసం యుద్ధ ప్రాంతం నుండి బయటపడే మార్గం కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్ కూడా ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి తన పౌరులను స్వదేశానికి రప్పించడానికి ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక చార్టర్డ్ విమానాల ద్వారా భారతీయ పౌరులు తిరిగి రావడానికి కేంద్రం ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించబోతోంది. అవసరమైతే నేవీని కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఇందులో “ఇజ్రాయెల్ నుండి వెనక్కి రావాలనుకునే మన పౌరులు తిరిగి రావడానికి వీలుగా #OperationAjayని ప్రారంభిస్తున్నాము. ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లు, ఇతర ఏర్పాట్లు చేశాం. విదేశాల్లో ఉన్న మన జాతీయుల భద్రత మరియు శ్రేయస్సుకు పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించారు.

ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం గురువారం ప్రత్యేక విమానంలో నమోదు చేసుకున్న మొదటి భారతీయ పౌరులకు ఈ మేరకు ఈ-మెయిల్ పంపినట్లు తెలిపింది. ఇలా దశల వారీగా నమోదు చేసుకున్న భారతీయుల్ని స్వదేశాలకు విమానాల్లో, నౌకల్లో తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ లో భాగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్, పాలస్తీనాలోని భారత రాయబార కార్యాలయాలతో టచ్ లో ఉండాలని అక్కడి భారతీయుల్ని కోరుతోంది.

YES9 TV