ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యనటలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు మోదీ పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పితోర్‌గఢ్‌కు ఒక రోజు పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు.
ఈ పూజలో భాగంగా మోదీ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తలపాగాతో పాటు పూర్తి స్థానిక సాంప్రదాయ దుస్తులను ధరించి ప్రధాని మోదీ ఈ పూజల్లో పాల్గొన్నారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు.
అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు : ఉత్తరాఖండ్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. మా ప్రభుత్వం ఉత్తరాఖండ్ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ర్ట ప్రజల ప్రతి ఒక్కరి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందించడం కోసం పితోర్‌ఘడ్‌లో నేను అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. గుంజి గ్రామ ప్రజలతో మమేకమయ్యే మంచి అవకాశం కూడా నాకు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన పార్వతీ కుండ్ దర్శనం కోసం, జగేశ్వర్ ధామ్‌లో పూజలు నిర్వహించడం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నారు.
కైలాస శిఖరం ముందు ప్రధాని ధ్యానం : అయితే పర్యటనలో భాగంగానే ముందుగా పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆ తర్వాత శివుని నివాసమైన ఆది కైలాస శిఖరం ముందు ప్రధాని మోదీ కాసేపు కూర్చుని ధ్యానం చేశారు. అయితే పూజ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో ఓ పోస్టు చేశారు.
”ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతి కుండ్‌లో దర్శనం చేసుకుని నేను ఎంతో సంతోషించాను. ఇక్కడ పూజలు నిర్వహించి నేను ఎంతో పొంగిపోయాను. ఇక్కడ జరిగిన ఆది కైలాస దర్శనంతో నా మనసు కూడా ఎంతో సంతోషించింది. ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రూ. 4200 కోట్ల ప్రాజెక్టు : అనంతరం, ప్రధాని మోదీ సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించారు. అక్కడ సైన్యం, ఐటీబీపీతో పాటు స్థానిక ప్రజలతో సంభాషించనున్నారు. అలాగే పితోర్‌గఢ్‌లో4,200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టు పనులకు ప్రధాని మోదీ ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఇక్కడ నిర్వహించే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.
