కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలపై మొదటి సంతకం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీలు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని రేవంత్ స్పష్టం చేశారు.
సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిన తర్వాత రోజు నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. తమ హామీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం వస్తుందని చలోక్తులు విసిరారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఏముందని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్, జేపీ నడ్డా పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ ఓటు బీఆర్ఎస్ కు బదిలీ అయిందని రేవంత్ ఆరోపించారు. ఇలా చేయడం వల్ల 106 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో తెలంగాణకు పట్టిన పీడ వదిలిపోతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. హస్తం పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రతి పేదవాడికి సంక్షమ పథకాలు అందిస్తాయని చెప్పారు. సంపద పెంచి పేదలకు పంచాలనేదే కాంగ్రెస్ విధానమని తెలిపారు. సీఎం కేసీఆర్ లక్ష కోట్లను దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రల్లో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు పాల్గొంటారని తెలిపారు.
త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని రేవంత్ తెలిపారు. కాగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఎన్నికల తేదీ కూడా డిక్లెర్ కావడంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ప్రకటించాలని భావిస్తోంది. 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. ఇప్పుడు డిసెంబర్ లో తెలంగాణలో మరో అద్బుతం జరగబోతోందని రేవంత్ జోస్యం చెప్పారు. 2023 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఓట్లను చీర్చాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పేవని పేర్కొన్నారు.
