జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం; ఉచిత వైద్య పరీక్షలతో పాటు వైద్యం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే అనేక పథకాలను అందిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

45 రోజులపాటు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలను వైద్య బృందాలు కలిసి ఏడు రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రామాలలోనే సురక్ష క్యాంపులను నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందించనున్నారు.

జగనన్న ఆరోగ్య సురక్షతో మరింత మెరుగైన వైద్యం అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా చెబుతున్నారు. స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రజలకు కావాల్సిన వైద్యం అందించటం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టినట్టు గా సమాచారం. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములేనని తెలిపారు.

మొత్తం 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్న జగన్ ప్రతి పీహెచ్సీ లోను ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నామని, ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని ఆరోగ్య సురక్ష లో భాగంగా జల్లెడ పట్టి, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేసి ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాలను అందిస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్న జగన్ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయమయ్యే వరకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలాగా కూడా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఒక డాక్టర్ పీహెచ్ సీలో ఉంటే మరో డాక్టర్ అంబులెన్స్ లో ఊర్లోకి వెళ్లి వైద్య సేవలు అందిస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Posted Under AP
YES9 TV