ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నేతలు నిరసనలు తెలియజేస్తుంటే, పక్కా ఆధారాలతో చంద్రబాబు పట్టుబడ్డాడని వైసిపి నేతలు మండిపడుతున్నారు.
ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన అన్ని ఆధారాలతోనే సిఐడి అరెస్టు చేస్తుందని, కోర్టులు కూడా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకపోవడానికి ఇదే కారణమని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన స్కాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, చంద్రబాబు తప్పించుకోలేడని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
అవినీతికి పాల్పడితే మా ప్రభుత్వంలో ఎంతటివారికైనా జైలు జీవితం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆయన మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువకాలం వారు రాజకీయాలు చేయలేరని విమర్శలు గుప్పించారు .ఏ వయసులో తప్పు చేసినా, నేరం నేరమే అవుతుందని పేర్కొన్న అనిల్ కుమార్ యాదవ్ భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
23 చంద్రబాబుకి లక్కీ నెంబర్ అని పేర్కొన్న అనిల్ కుమార్ యాదవ్ తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు అని, అందుకే 2018లో ఆయనకు 23 సీట్లు వచ్చాయని విమర్శించారు. జైలులో రిమాండ్ తేదీ కూడా 23 నే అయిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అరెస్ట్ పై సొంత పార్టీ నేతలు సైలెంట్ గా ఉంటే, మా పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎక్కువ హడావిడి చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నేరం చేశాడు కనుకే చంద్రబాబు బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పడుతున్నాడని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
