శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం

తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు టీటీడీ అర్చకులు. ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు.

ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 5.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. 18వ తేదీన ఆయన శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ నాడు 72,650 మంది తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మొత్తం 30.22 లక్షల లడ్డూలను విక్రయించారు టీటీడీ అధికారులు. రోజుకు ఎనిమిది లక్షల లడ్డూలను బఫర్‌ స్టాక్‌గా అందుబాటులో ఉంచారు. ఈ ఎనిమిది రోజుల్లో హుండీ ద్వారా 24.22 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తిరుమల వ్యాప్తంగా 2,770 సీసీటీవీలను అమర్చారు. 5,000 మంది టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇక చిన్నపిల్లలు తప్పిపోకుండా 6,000 ఛైల్డ్ ట్యాగ్‌లను కట్టారు. బ్రహ్మోత్సవాల్లో 2.07 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. 1,150 మంది క్షురకులు 11 కల్యాణకట్టల్లో భక్తులకు తలనీలాలు తీశారు.

గదుల కేటాయింపు ద్వారా వచ్చిన ఆదాయం 1.69 కోట్ల రూపాయలు. బ్రహ్మోత్సవాల ఎనిమిది రోజుల్లో 16.28 లక్షల భోజనాలు, అల్పాహారాన్ని భక్తులకు అందించారు టీటీడీ అధికారులు. ఒక్క గరుడసేవ నాడే 4.81 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.37 లక్షల మందికి టీ, కాఫీ, పాలు, 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందించారు.

హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ నుంచి వచ్చిన 152 కళా బృందాలు, 3,710 మంది కళాకారులు, 52 కళా రూపాలను ప్రదర్శించారు.

Posted Under AP
YES9 TV