చంద్రబాబు కోసం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నారా లోకేష్!!

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన బెయిల్ కోసం పోరాడుతూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం చేస్తూ, తన తండ్రి అరెస్టు నేపథ్యంలో కావలసిన మద్దతును కూడగడుతున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలలో టిడిపి ఎంపీలకు దిశా నిర్దేశం చేయడంతో పాటు ఢిల్లీ పెద్దలను కూడా కలుస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో జాతీయ మీడియా ముందు తమ వాణిని వినిపించిన లోకేష్, చంద్రబాబును కక్ష సాధింపు చర్యలో భాగంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

మరొకవైపు పార్లమెంట్లోనూ చంద్రబాబు వ్యవహారం ప్రస్తావనకు వచ్చే విధంగా లోకేష్ టిడిపి ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఢిల్లీ వేదికగా నిరసన గళాన్ని వినిపించారు. ఇక తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. టిడిపి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ లతో కలిసి రాష్ట్రపతిని కలిశారు.

ద్రౌపది ముర్మును కలిసిన నారా లోకేష్ టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.జగన్ పాలన అరాచకాల మయమని, ఆయన విపక్షాలను అణిచి వేస్తున్నారని లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. అక్రమ కేసులో కక్షపూరితంగా చంద్రబాబుని అరెస్టు చేశారని లోకేష్ పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో రాష్ట్రపతి చొరవ చూపాలని నారా లోకేష్ ఆమెకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ నేతల బృందం చెప్పిన విషయాలను రాష్ట్రపతి సానుకూలంగా విన్నట్టు తెలుస్తుంది. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు మద్దతు కూడగట్టటం కోసం లోకేష్ ఇప్పుడు హస్తిన వేదికగా నానా అగచాట్లు పడుతున్నారు.

Posted Under AP
YES9 TV