ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్దితులు ఉప్పుూనిప్పులా మారిపోయాయి.
అనంతరం భారత సీనియర్ దౌత్యవేత్యను కెనడా బహిష్కరిస్తే.. భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఆ తర్వాత కెనడా భారత్ లో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తే.. ఇవాళ భారత్ కూడా కెనడాలో తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.
కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయంగా మన్నించబడుతున్న ద్వేషపూరిత నేరాలు, నేర హింసల దృష్ట్యా, అక్కడ ఉన్న భారతీయ పౌరులందరూ, ప్రయాణాలను గురించి ఆలోచించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ ఇవాళ ఓ ప్రకటనలో సూచించింది. ఇటీవల, బెదిరింపులు ముఖ్యంగా భారత దౌత్యవేత్తలు, భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే భారతీయ సమాజంలోని విభాగాలను లక్ష్యంగా చేసుకున్నాయని, అందువల్ల కెనడాలో ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండవలసిందిగా భారతీయ పౌరులకు సూచించింది.
అలాగే కెనడాలో భారత హై కమిషన్, కాన్సులేట్ నిత్యం స్ధానిక అధికారులతో టచ్ లో ఉంటూ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని తెలిపింది. కెనడాలో భయానకంగా మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసం ఉందని విదేశాంగ శాఖ ప్రకటనలో హెచ్చరించింది. భారతీయ పౌరులు, విద్యార్ధులు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ తో పాటు టొరంలో, వాంకోవర్ లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కూడా సూచించింది.
అలాగే కెనడాలో భారతీయులకు సాయం కోసం మదద్ పేరుతో ఓ వెబ్ సైట్ కూడా అందుబాటులోకి తెచ్చింది. madad.gov.in పేరుతో రూపొందించిన ఈ వెబ్ సైట్లోనూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని విదేశాంగ శాఖ భారత పౌరులు, విద్యార్ధులకు సూచిస్తోంది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్ధితులు ఏర్పడినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతోంది.
