హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచన చేసింది. అక్టోబర్ నెల 1వ తేదీ వరకు హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లకముందే సెప్టెంబర్‌లో హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
రాబోయే కొద్ది రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి రుతుపవనాలు మరింత విస్తరించి.. నెలాఖరు వరకు చురుగ్గా ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28వ తేదీ మధ్య సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదువుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అక్టోబర్ 5 వరకు మోస్తరు వర్షాలు కొనసాగుతాయని చెబుతున్నారు.
అయితే, నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 6 నుంచి 12 మధ్య వెళ్లిపోయే అవకాశం ఉందని.. ఈ మధ్య కాలంలో తెలంగాణలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తుఫాను సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు ఉత్తర బంగాళాఖాతం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని పేర్కొంది.
ఇప్పటి వరకు 33 జిల్లాల్లో రెండు జిల్లాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, ఎనిమిది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరో మూడు జిల్లాల్లో గత వారం రోజులుగా భారీ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపింది. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో బలహీనమైన ఎల్‌నినో పరిస్థితులు నెలకొని ఉన్నాయని.. వచ్చే ఏడాది ప్రారంభం వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.
