సెర్చ్ ఇంజన్ అంటే ప్రపంచంలో అందరికీ తెలిసింది గూగుల్ సెర్చ్ ఇంజనే. ఇది కాకుండా యాపిల్ సఫారీ, బింగ్, యాహూ, బైదూ, డక్ డక్ గో వంటి ఇతరత్రా సెర్చ్ ఇంజన్లు కూడా ఉన్నాయి.
అయినా దశాబ్దాలుగా గూగుల్ సెర్చ్ మాత్రమే మార్కెట్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలేస్తోంది. దీని వెనుక కారణాలు మాత్రం గూగుల్ సెర్చ్ ఇంజన్ యూజర్లలో కనీసం ఒక్కశాతం మందికీ తెలియదు. కానీ గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యంపై అమెరికా కోర్టుల్లో సాగుతున్న విచారణ ఇప్పుడు వాస్తవాల్ని బయటపెడుతోంది.
గూగుల్ సెర్చ్ ఇంజన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో తమ గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. మిగతా బ్రౌజర్లు, సెర్చ్ ఇంజన్లూ ఉన్నప్పటికీ వాటిని జనం ఆదరించడం లేదని మనం అనుకుంటాం. కానీ అలా ఆదరించకుండా వాటిని దాచేస్తోంది కూడా గూగులేనట. దీనికి వారికి భారీగా ముడుపులు చెల్లిస్తోందట. అయితే ఇలా మార్కెట్లో తమ ప్రత్యర్ధులకు గూగుల్ ఎంత చెల్లిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ విషయం తాజాగా అమెరికా ప్రభుత్వమే కోర్టుల్లో బయటపెట్టింది.
ఆన్‌లైన్ సెర్చ్‌పై తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి గూగుల్ సంస్ధ.. మార్కెట్లోని తన ప్రత్యర్ధులైన ఆపిల్ తో పాటు ఇతర సంస్థలకు సంవత్సరానికి 10 బిలియన్ డాలర్లు చెల్లిస్తోందని అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరోపించింది. రెండు దశాబ్దాలకు పైగా అమెరికా కోర్టుల్లో అతిపెద్ద నమ్మకద్రోహం కేసుగా ప్రచారంలో ఉన్న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. ఇందులో అమెరికా ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. ఈ కేసు ఇంటర్నెట్ భవిష్యత్తుకు సంబంధించినదని,సెర్చ్ లో గూగుల్ ఎప్పుడైనా సరైన పోటీని ఎదుర్కొందా అని అమెరికా ప్రభుత్వం ప్రశ్నించింది.
కేసు విచారణ సందర్భంగా గూగుల్ న్యాయవాది 10 వారాలుగా డజన్ల కొద్దీ సాక్ష్యుల్ని పిలిపించాలని, అయినా ఈ కేసులో ఎలాంటి మెరిట్ కనిపించడం లేదని తెలిపారు. అలాగే దశాబ్దాలుగా గూగుల్ సెర్చ్ ఇంజన్ విజయవంతంగా పనిచేస్తుందని, ఇంకా మెరుగుపడుతోందన్నారు. గతంలో విండోస్ పై మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం విషయంలో ఎదురైన కేసు తర్వాత అమెరికా ప్రభుత్వం ఇలా మరో టెక్ దిగ్గజంతో పోరుకు సిద్దం కావడం ఇదే తొలిసారి.
అలాగే గూగుల్ సెర్చ్ ఆధిపత్యం తన మాతృసంస్ధ ఆల్ఫాబెట్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న కంపెనీలలో ఒకటిగా మార్చింది. సెర్చ్ ప్రకటనలు కంపెనీ ఆదాయంలో దాదాపు 60 శాతం తెచ్చిపెడుతున్నాయి. యూట్యూబ్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌ల వంటి ఇతర కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అలాగే ఫీడ్ బ్యాక్ లూప్ పిలుస్తున్న ఓ సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ ఇలా ప్రత్యర్ధుల్ని తనకు పోటీ రాకుండా చూస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై విచారణ కొనసాగుతోంది.
