చంద్రబాబుకు కర్మ సిద్ధాంతం చెప్పి, పురందరేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడంపై వైసిపి మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న రోజా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అంటూ, చంద్రబాబు వీడియోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు.

ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్టు జరగలేదని ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టుకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం ఎందుకు సమర్థనీయం కాదు అన్నది పురందరేశ్వరి చెప్పాలని ప్రశ్నించారు రోజా.

చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి వివిధ సెక్షన్లను ట్విట్టర్ వేదికగా వివరించారు. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న రోజా , సీఆర్పీసీ 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు. 9/12/2021 న సిఐడి ఈఓడబ్ల్యూ వింగ్ ఎఫ్ఐఆర్ నమోదు పేర్కొన్న రోజా చంద్రబాబుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది అన్నారు.

120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ఐపీసీ సెక్షన్ 420 మోసం, చీటింగ్, నమ్మకద్రోహం,IPCసెక్షన్ 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసం, ఫోర్జరీ,471 నకిలీపత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలోని ఆస్థిని అక్రమంగా కట్టబెట్టడం 12,13(2) అవినీతికి పాల్పడటం, 13(1)(C)(D)పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడటం చేశారని పేర్కొన్నారు.

ఇప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ఎందుకు సమర్థనీయం కాదు అన్నది బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పాలన్నారు. మీరు భారతీయ జనతా పార్టీని మీ బావ జనతా పార్టీ గా మార్చేశారని పురందరేశ్వరికి గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా.

Posted Under AP
Editor