ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు.

జీ20 సదస్సు జరిగే సమయంలో రాజధాని ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా ఆర్మీ పలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

దేశ రాజధానిలో భారత సైన్యం విధ్వంస వ్యతిరేక మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 202 కౌంటర్ ఎక్స్‌ప్లోజివ్స్ డివైస్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్‌ఎస్ బోస్ మాట్లాడుతూ, “మాకు అందించబడిన ప్రధాన పాత్ర AAS (ఏరియా యాంటీ విధ్వంసక) కవర్. AAS కవర్ ప్రాథమికంగా మూడు భాగాలలో ఉంది- విధ్వంసక నిరోధక తనిఖీ, ఏరియా శానిటైజేషన్ మరియు అనుమానిత వస్తువులను సురక్షితంగా పారవేయడం…” అని తెలిపారు.

జీ20 సదస్సుకు దేశ విదేశీ అతిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో అమెరికాతో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. వీరి భద్రతలో ఎలాంటి లోపాలు తలెత్తినా అది అంతర్జాతీయంగా భారత్ పరువు తీసే అవకాశం ఉంది. దీంతో కేంద్రం ఆర్మీతో పాటు ఢిల్లీ, ఇతర రాష్ట్రాల పోలీసుల్నిసైతం భారీ ఎత్తున దేశ రాజధానిలో మోహరిస్తోంది. అలాగే విదేశీ అతిధుల భద్రత కోసం ప్రత్యేక బలగాల్ని సైతం రప్పిస్తున్నారు.

జీ20 సదస్సు సందర్బంగా దేశ రాజధానిలో భారీ ఎత్తున వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు, రైలు రవాణాను దాదాపుగా నియంత్రించిన కేంద్రం.. ఇప్పుడు నగరంలోకి వచ్చే వాహనాల్ని పూర్తి స్ధాయిలో తనిఖీ చేయిస్తోంది. దీంతో ఈ నాలుగు రోజులు ఢిల్లీకి వెళ్లేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు జంకే పరిస్ధితి. అక్కడే ఉన్నవారు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు తమ ఉద్యోగులకు సెలవులు కూడా ప్రకటిస్తున్నాయి.

Editor