ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగం

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిషన్ -2024 లో భాగంగా బీజేపీ కేంద్రం నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పైన తాజాగా సంకేతాలు అందుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిగేలా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

లోక్ సభతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు : ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. కానీ, కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..జమిలి ఎన్నికల పైన చర్చ వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. కేంద్రం జమిలికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నా..తక్షణం అమలుకు సాధ్యం కాదనే వాదన ఉంది. అయితే, ఎన్నికల సంఘానికి మాత్రం ఎన్నికల నిర్వహణాధికారం పైన ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.

అందులో భాగంగా ఆరు నెలలు ముందు ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ముందస్తు ఖాయమా అనే చర్చ మొదలైంది. ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తున్నారు.

బీజేపీ నుంచి సంకేతాలు : తెలంగాణలో జనవరిలో కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది. అదే విధంగా ఏపీలో లోక్ సభతో పాటుగానే ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభకు ముందస్తు ఖాయమైతే అప్పుడే ఏపీలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ నేతలు చెబుతున్న సమచారం మేరకు వచ్చే జనవరిలోనే లోక్ సభ ఎన్నికలు ఉంటాయని చెబుతున్నారు. లోక్ సభతో పాటుగానే ఏపీ, తెలంగాణ ఎన్నికలు అదే విధంగా మొత్తంగా 13 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు.

ఇండియా కూటమిగా ఉన్న ప్రతిపక్ష కూమటి నేతలు ఇదే అంచనాతో ఉన్నారు. అదే జరిగితే రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో ఒక నెల ఆలస్యంగా.. ఏపీలో రెండు నెలలు ముందుగా ఎన్నికలు జరగే పరిస్థితి ఉంటుంది.

ఏపీ- తెలంగాణ ఒకే సారి జరిగేనా : 2019 ఎన్నికల తరువాత ప్రధాని మోదీ అధ్యక్షత ఢిల్లీలో జమిలి ఎన్నికల నిర్వహణ పైన ప్రత్యేక భేటీ జరిగింది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖత వ్యక్తం చేసారు. ఇప్పుడు బీజేపీ. ఇండియా కూటమి నేతలు అంచనా వేస్తున్నట్లుగా జనవరి ద్వితీయార్ధంలో లోక్ సభ..12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాలని నిర్ణయిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వాతావరణం మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్దుల జాబితాను ప్రకటించింది. వైసీపీ నేతలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దమని చెబుతున్నారు. అయితే, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల రాజకీయం కీలకంగా మారనుంది. దీంతో..ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Editor