దిల్లీ : జీ 20 (G20- summit) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ (India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నందున సెప్టెంబర్ 8-10 తేదీల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ (Online food delivery) సేవలకు అనుమతిని నిషేధించినట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు.
అయితే నగరంలో లాక్‌డౌన్ ఊహాగానాలను తోసిపుచ్చుతూ.. అత్యవసర సమయంలో హెల్ప్‌లైన్ డెస్క్ అందుబాటులో ఉంటుందని ఎవరూ లాక్‌డౌన్ ఉంటుందని భయందోళనలకు గురికావద్దని పోలీసులు తెలిపారు.
జీ 20 సమావేశానికి హాజరయ్యే వీవీఐపీల (VVIP) భద్రత దృష్ట్యా వారు వెళ్లే మార్గాల్లో ఉన్న మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేయాలని దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ను ప్రభుత్వం కోరింది.
నగరంలో పటిష్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లను కూడా ప్రకటించారు.సెప్టెంబరు 7వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయన్నారు. అంతేకాకుండా గురుగ్రామ్‌లోని పలు కంపెనీలకు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను (ఇంటి నుంచే పని) అమలు చేయాలని సూచించారు. ఇప్పటికే దేశ రాజధానిలో ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అలాగే సదస్సు దృష్ట్యా నగరంలో ఈ రెండు రోజులు అన్ని మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు, మద్యం దుకాణాలు మూసివేయాలి. వాణిజ్య సంస్థల యజమానులు తమ ఉద్యోగులకు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే దిల్లీ అంతటా హై అలర్ట్ మొదలైంది. దేశాధినేతలకు ఆతిథ్యం ఇస్తున్నందున లక్ష మందికి పైగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
