ఇస్లామాబాద్: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్..
తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
రోవర్ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. పేలోడ్స్ అన్నీ స్విచ్ ఆన్ అయ్యాయని తెలిపారు. వాటి ద్వారా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా త్వరలో అందుతుందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల మధ్య చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల పాకిస్తాన్ స్పందించింది. కాస్త ఆలస్యంగానైనా సానుకూలంగా స్పందించింది. చంద్రయాన్ 3ని ప్రయోగించడం, చంద్రుడిపై దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడాన్ని శాస్త్ర, సాంకేతికపరంగా గొప్ప విజయమని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్.. కూడా ఇస్లామాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం జరిగిన వీక్లీ ప్రెస్ బ్రీఫింగ్‌లో ఆమె మాట్లాడారు.
చంద్రయాన్ 3 అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. సానుకూలంగా స్పందించారు ముంతాజ్. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడాన్ని గొప్ప సైంటిఫిక్ విజయంగా అభివర్ణించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రశంసలకు అన్ని విధాలుగా అర్హులు అని వ్యాఖ్యానించారు.
రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో- భారత్ సాధించిన అంతరిక్ష విజయాల పట్ల పాకిస్తాన్ బహిరంగంగా, సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి కూడా భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.
