Latest Posts

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న సిఎస్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 341 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లు, అంశాలు పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికే 341 డిమాండ్లను పరిష్కరించామని వివరించారు.

ఉద్యోగులకు సంబంధించిన మిగతా అంశాలు పరిశీలనలో ఉన్నాయని వాటిని కూడా సాధ్యమైనంత తొందరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ సహా వివిధశాఖల అధికారులు సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కరోనాతో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు కారుణ్య విధానంలో 1042 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ ప్రకారం ఉత్తర్వులు ఇచ్చే ముందు చర్చించాలని, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు జిల్లా కేంద్రాల్లో వంద ఎకరాలు కేటాయించాలని, ఔట్ సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు పెంచాలని , హెల్త్‌ స్కీమ్ పథకాలు అందించాలని కోరినట్టు చెప్పారు.

పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కరించాలని కోరినట్టు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. 40 రోజుల్లోగా కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్‌ లీవ్‌లు రూ.800 కోట్లు పెడింగ్‌లో ఉన్నాయని, ఆగస్టు, సెప్టెంబరులో బకాయిలు ఇస్తామని చెప్పారని తెలిపారు. 2004కు ముందు చేరిన వారికి ఓపీఎస్‌ అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.

Posted Under AP
YES9 TV