ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వివాదంపై రాజ్‌భవన్ స్పందించింది. గత మార్చిలో గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల పదోన్నతుల్లో ఇనిషియల్ క్యాడర్ సీనియారిటీఅమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఆందోళనకు కారణమైంది.
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో 20ఏళ్లుగా అమలవుతున్న నిబంధనల్ని పక్కన పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ఉద్యోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పదోన్నతుల్లో ప్రస్తుత కేటగరీలను కాకుండా ఇనిషియల్ క్యాడర్‌ను సీనియారిటీలో పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేపుడు ప్రస్తుతం పని చేసే స్థానంలో సీనియారిటీని కాకుండా, ఉద్యోగి నియామక తేదీ నుంచి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల్ని హరించేలా ఉందని ఆరోపిస్తున్నారు. మార్చి 6వ తేదీన జారీ చేసిన ఆఫీసు ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి స్పందించిన రాజ్‌భవన్ ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిఏడి పొలిటికల్ సెక్రటరీకి లేఖను పంపింది.
ఉద్యోగుల పదోన్నతులపై ప్రభావం చూపించే నిర్ణయంపై కొందరు ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ సలహాదారుల కుట్ర ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగ వర్గాల్లో చీలిక తీసుకువచ్చేందుకే కోర్టు ఉత్తర్వులకు వక్ర భాష్యాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు శనివారం తాడేపల్లిలో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసే నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం మొదట్నుంచి వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా రిజర్వేషన్ల వ్యవహారంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో ఒక రకంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించడం ఒకరిద్దరు సలహాదారులకు అలవాటైందని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళ్లే అవకాశం కూడా దక్కకుండా సిఎంఓ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు.
