కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు.
సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్‌గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు నిల్చుని మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే కెనడా, అమెరికా, యూకేల్లో భారతీయ దౌత్యవేత్తలను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్ల వెనక తన హస్తం ఉన్నట్లు పన్నూ స్పష్టం చేశాడు. ఇటీవల కెనడాలో చంపబడిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తన సోదరుడని.. ఆయనతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ చనిపోవడానికి అమెరికా, కెనడాల్లోని భారతీయ దౌత్యవేత్తలే కారణం అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు. జూలై 5న షూట్ చేసిన వీడియో అని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశాడు. న్యూయార్క్ లో యూఎన్ కార్యాలయం ముందు నిలబడి.. ఓదో రోజు ఖలిస్తాన్ జెండా ఇక్కడ ఎగురుతుందని అనడం వీడియోలో చూడవచ్చు.
