Latest Posts

తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, మెదక్, ములుగు, వరంగల్ జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీంతో కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పదివేలకు చేరువకానున్నాయి.

కాగా, ఒక్కో జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కల సాకారం అవుతోంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. దీంతో తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుంది. ఈ 9 ఏళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.

YES9 TV