Latest Posts

యూఎస్ లోకి ఉబర్ సాయంతో అక్రమంగా 800 మంది భారతీయుల తరలింపు

టాక్సీ ఎగ్రిగేటర్ యాప్ ‘ఉబర్’ సాయంతో 800 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు చేర్చిన ఇండియన్ డ్రైవర్ ను అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.

కెనడా నుంచి యూఎస్ కు..

భారతీయులను కెనడా నుంచి అమెరికాకు స్మగుల్ చేస్తున్న భారత్ కు చెందిన రాజిందర్ పాల్ సింగ్ అలియాస్ జస్పాల్ గిల్ కు అమెరికా కోర్టు 45 నెలల జైలు శిక్ష విధించింది. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న రాజిందర్ పాల్ సింగ్ అలియాస్ జస్పాల్ గిల్ వృత్తి రీత్యా డ్రైవర్. కెనడా నుంచి యూఎస్ కు అక్రమంగా మనుషులను తరలించే ముఠాలో ఆయన కీలక సభ్యుడు. ఈ స్మగ్లింగ్ ద్వారా ఆయన 5 లక్షల డాలర్ల వరకు అక్రమంగా సంపాదించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టు బుధవారం ఆయనకు 45 నెలల జైలు శిక్ష విధించింది. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆయన కెనడా నుంచి అక్రమంగా సుమారు 800 మంది భారతీయులను అమెరికాకు తరలించాడు. కెనడా ఉత్తర సరిహద్దు ద్వారా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి వారిని తరలించేవాడు. ఇందుకు ఆయన ఉబర్ యాప్ ను ఉపయోగించుకునేవాడు.

ఆరు నెలలుగా నిఘా

గత అక్టోబర్ నుంచి ఈ మార్చి నెలల మధ్యలో యూఎస్ సరిహద్దు నిఘా అధికారులు కెనడాలోని మానిటొబా నుంచి యూఎస్ లోని మినెసొటా లేక నార్త్ డకోటా లోకి అక్రమంగా వస్తున్న సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత ఆరునెలల్లో యూఎస్ కు అక్రమంగా వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం గమనించిన అమెరికా అధికారులు, కెనడా సరిహద్దుల్లో నిఘా పెంచారు. దాంతో, రాజిందర్ పాల్ సింగ్ దొరికిపోయాడు. ఫిబ్రవరి నెలలో కోర్టు ముందు తన నేరాన్ని అంగీకరించాడు.

YES9 TV