‘క్వీన్ ఆఫ్ పాప్’ గా, ‘మెటీరియల్ గర్ల్’ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ స్టార్ మడోనా (Madonna) తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు.
ప్రాణాంతక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడడంతో ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. తీవ్రమైన జ్వరం, విరామం లేకుండా వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి తలెత్తడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. మడోనా వయస్సు 64 ఏళ్లు.
సీరియస్ కండిషన్
ఆమె కండిషన్ సీరియస్ గా ఉందని, చికిత్సకు స్పందించడం కూడా లేదని మొదట వైద్యులు తెలిపారు. ఐసీయూలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆ తరువాత, ఆమె నెమ్మదిగా కోలుకుంటోందని ప్రకటించారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన మడోనా న్యూయార్క్ లోని తన ఇంట్లో వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉంటోంది. అయితే, మడోనా అనారోగ్య తీవ్రత తగ్గలేదని, వామిటింగ్స్ కొనసాగుతున్నాయని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆమె పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నారని, వాంతులు నియంత్రణ లోకి రావడం లేదని వెల్లడించారు.
‘సెలబ్రేషన్’ టూర్ కోసం..
మడోనా ప్రాణాంతక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత శనివారం నుంచి ఆమె వాంతులు, జ్వరంతో బాధపడుతున్నారని వివరించాయి. మొదట్లో ఈ అనారోగ్యాన్ని ఆమె పట్టించుకోలేదని, దాంతో పరిస్థితి సీరియస్ గా మారిందని తెలిపాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అనారోగ్యానికి గురి కాకముందు, జులై 15 నుంచి తాను ప్రారంభించబోయే ‘సెలబ్రేషన్ (Celebration)’ టూర్ కోసం మడోనా రాత్రింబవళ్లు ప్రాక్టిస్ చేశారు. అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా, రోజుకు 16 గంటలు ప్రాక్టిస్ చేశారు. అయితే, ఇప్పుడు ఇలా తీవ్ర స్థాయిలో అస్వస్థతకు లోనవడంతో.. ఆమె సమీప భవిష్యత్తులో పాల్గొనాల్సిన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మడోనా మేనేజర్ గే ఓసరీ ప్రకటించారు.
