హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 4 నియామక పరీక్ష హాల్ టికెట్లను శనివారం(జూన్ 24) నుంచి జారీ చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 8180 గ్రూప్ 4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే రావాలని.. చివరి నిమిషంలో హడావుడా ఇబ్బంది పడొద్దని సూచించారు.
హాల్‌టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బంది పడే ప్రమాదం ఉందని తెలిపారు. హాల్ టికెట్ వెనక భాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలన్నీ పొందు పరచామని, వాటికి తప్పక పాటించాలని సూచించారు.
తెలంగాణలో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆదేశాలు
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో నూతనంగా 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా నేరుగా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
