Latest Posts

కలిసిపోయిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి: అన్నదమ్ముల్లా పని చేస్తాం; టార్గెట్ ఫిక్స్!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఆసక్తిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

చాలాకాలంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ప్రస్తుతం వారు ఇరువురు నేతలు ఒకే లక్ష్యంతో, అన్నదమ్ముల్లా కలిసి పనిచేయడానికి రెడీ అయినట్లుగా ప్రకటన చేయడం ఒక్కసారిగా రాజకీయ నాయకులు అందరి దృష్టిని ఆకర్షించింది.

నేడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలతో పాటు ఇతర పరిణామాలపై ఆయనతో చర్చించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను కలిసి పని చేస్తామని, రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు కలిసి పని చేస్తామని, అధికారంలోకి వచ్చినా కూడా కలిసే ఉంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికలలో 15 సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక నల్గొండ జిల్లాలో చేరికలపై స్పందించిన రేవంత్ రెడ్డి స్థానిక నాయకత్వం తో మాట్లాడకుండా ఎవరిని పార్టీలోకి చేసుకునేది లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లతో చర్చించిన తర్వాతనే ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటామని, స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ పార్టీలోకి చేసుకునేది లేదని స్పష్టం చేశారు.

భేటీ అనంతరం మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి, తాను సోదరులుగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు . ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కి తెలియకుండా చేరికలు ఏవీ జరగవని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అంతేకాదు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తాము పని చేస్తామని పేర్కొన్నారు.

YES9 TV