బెంగళూరు: కిందటి నెలలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది కర్ణాటక. 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది.
135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 66 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)- 19, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.
సరిగ్గా నెలన్నర రోజుల వ్యవధిలో కర్ణాటకలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. శాసన మండలిలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇదివరకే కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ముగ్గురు శాసన మండలి సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నికలు అవసరం అయ్యాయి.
బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు- బాబూరావ్ చించనాసుర్, రామచంద్రప్ప శంకర్, లక్ష్మణ సవాది తమ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారిలో బాబూరావ్ చించనాసుర్ మార్చి 20వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 12వ తేదీన ఆర్ శంకర్, అదే నెల 14వ తేదీన లక్ష్మణ సవాది.. శాసన మండలి ఛైర్మన్‌కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బాబూరావ్ చించనాసుర్, లక్ష్మణ సవాది- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అథణి నుంచి పోటీ చేసిన లక్ష్మణ సవాది ఘన విజయం సాధించగా.. గుర్మిట్‌కల్ నుంచి బరిలోకి దిగిన బాబూరావ్ ఓటమి పాలయ్యారు. బాబూరావ్- 2024 జూన్ 17, ఆర్ శంకర్- 2026 జూన్ 30, లక్ష్మణ సవాది- 2028 జూన్ 14వ తేదీ నాటికి పదవీ కాలం ముగియాల్సి ఉంది.
ఈ లోపే వారు తమ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి. ఈ మూడు స్థానాలు కూడా ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవి. దీనికి ఈ నెల 20వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడువు.. ఈ నెల 23వ తేదీ. ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది ఈసీ.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఎమ్మెల్యేల కోటాలో జరగాల్సిన ఎన్నికలు కావడం వల్ల అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు స్థానాలను కూడా గెలుచుకోవడం నల్లేరు మీద నడకే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ ఎన్నికల్లో ఉప పోటీ చేయడానికి అభ్యర్థులను కొద్దిసేపటి కిందటే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, కలబురగి జిల్లాకు చెందిన తిప్పన్నప్ప కమక్నూర్, రాయచూర్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ బోస్‌రాజు పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం బోస్‌రాజు.. సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. చిన్న నీటి పారుదల, జల వనరుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తోన్నారు. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీలో గానీ, శాసన మండలిలో గానీ సభ్యుడు కాదు. మంత్రి పదవిని స్వీకరించిన ఆరు నెలల వ్యవధిలోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో- శాసన మండలి ఉప ఎన్నిక కోసం ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంది కాంగ్రెస్.
