కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా స్పందిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభల్లో చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తనపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు, విమర్శలను కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిప్పికొట్టారు. పవన్ తనకు ఏ మాత్రం పోటీనే కాదని తేల్చి చెప్పారు. తానేదో అల్లాటప్పాగా, పవన్ కల్యాణ్ లాగా అన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ జెండాలను భుజాన మోసి.. శాసనసభ్యుడిని అయ్యానని అన్నారు.
వైఎస్ఆర్సీపీలో చేరిన తరువాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యానని, రెండుచోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ తనకు పోటీ కాదని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగిన తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ నుంచి ఎన్నికల్లో నిలబెట్టారని, గెలిచి ఆయన విశ్వాసాన్ని నిలబెట్టానని అన్నారు.
తన మీద లేని పోని ఆరోపణలు, లేని పోని నిందలు వేస్తే చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దని పవన్ కల్యాణ్‌ను ఆయన హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలు, విమర్శలు నిజమే అయితే వాటిని తాను ఖండించబోనని తేల్చి చెప్పారు. అకారణంగా, అనవసరంగా విమర్శలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోననీ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీదానికీ సమాధానం ఇస్తానని అన్నారు.
