ఏపీ రాకీయాల్లోనూ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు టార్గెట్ సీఎం జగన్ గా పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. వైసీపీ సింగిల్ ఫైట్ కు సిద్దం అవుతోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్…వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు..టీడీపీతో బంధం.. ఎన్నికల ఫలితాలపైన నెల్లూరు సీనియర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేసారు.
పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో తన వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజు కాకినాడలో జరిగే సభలో పవన్ ప్రసంగించనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గురించి అక్కడ జరిగే సభలో చెబుతానంటూ పవన్ కల్యాణ్ ఈ రోజు సభ పైన ఆసక్తి పెంచారు. ఇప్పటికే పవన్ చేస్తున్న వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కొన్ని విష సర్పాలు బయలు దేరాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కుర్చీ.కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటయ్యారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మరోసారి కామెంట్స్ చేసారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ సూటు కేసులు తీసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. ఎమ్మెల్యే అయితే చాలు సభలో అడుగు పెట్టాలననే ఆలోచనకు పవన్ పరిమితం అయ్యారని ఎద్దేవా చేసారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అమాయకులు కాదు.. రాజకీయ నాయకులు కన్నా తెలివైన వారని విశ్లేషించారు.
