పౌర్ణమి వేళ..విజయవాడ నుంచి అరుణాచలానికి బస్సు: రిజర్వేషన్, ఛార్జీల వివరాలివే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది.

వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.

తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టింది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఊటీ, గోవా, పుదుచ్చేరికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకెండ్ సర్వీస్ పేరుతో ప్రతి శనివారం నెల్లూరు నుంచి పుదుచ్చేరి మధ్య ప్రవేశపెట్టిన బస్సుకు మంచి డిమాండ్ లభిస్తోంది.

తాజాగా విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును నడిపించనుంది ఏపీఎస్ఆర్టీసీ. జులై 3వ తేదీన పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకుంది. పౌర్ణమి నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ అనంతరం అగ్నిరూపంలో వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు.

గిరి ప్రదక్షిణ కోసం ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తుంటారు. ఈ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాజాగా విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును నడిపించనుంది. జులై 3వ తేదీన పౌర్ణమి కాగా.. అదే నెల 1వ తేదీన రాత్రి 9 గంటలకు ఈ బస్సు విజయవాడలోని పీఎన్‌బీఎస్ నుంచి అరుణాచలానికి బయలుదేరి వెళ్తుంది.

2వ తేదీన ఉదయం శ్రీకాళహస్తికి చేరుకుంటుంది. కాళహస్తీశ్వరుడిని దర్శనానంంతరం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని కాణిపాకానికి బయలుదేరుతుంది. వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దర్శనం అనంతరం తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. రాత్రి గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం తరువాత అరుణాచలానికి బయలుదేరి వెళ్తుంది. 3వ తేదీ ఉదయం అరుణాచలం చేరుకుంటుంది.

Posted Under AP
YES9 TV