గో బ్యాక్ రాజయ్య; ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు షాకిచ్చిన గ్రామస్తులు!!

వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ లు సైతం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పని చేయడానికి రంగంలోకి దిగారు. అయితే చాలాచోట్ల బి ఆర్ ఎస్ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు నేడు నిరసన సెగ తగిలింది. రఘునాథపల్లి మండల రామన్నగూడెం లో ఆయన పర్యటిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఇప్పటివరకు ఏం చేసావ్ అని.. మళ్లీ వస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మూకుమ్మడిగా ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు.

Posted Under AP
YES9 TV