లోకేష్ తో ఎమ్మెల్యే మేకపాటి భేటీ-అటు ఆనం, కోటంరెడ్డితో టీడీపీ నేతల చర్చల వేళ..

ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయంగా నేతలు తమ భవిష్యత్తు దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు వరుసగా టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు.

జిల్లాకు చెందిన వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఇప్పటికే టీడీపీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతుండగా.. అదే సమయంలో లోకేష్ తో మరో ఎమ్మెల్యే మేకపాటి భేటీ అయ్యారు.

వైఎస్సార్ జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను ఇవాళ ఉదయగిరికి చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. మరికొన్ని రోజుల్లో లోకేష్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ముగ్గురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు.

ఇవాళ బద్వేలులో లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో క్యాంపు ఏర్పాటు చేసిన ప్రాంతంలో భేటీ అయ్యారు. టీడీపీలో చేరికపై తన అభిప్రాయాన్ని మేకపాటి లోకేష్ కు వెల్లడించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఎంట్రీ అయిన తర్వాత టీడీపీలో చేరే అంశంపై లోకేష్ తో మేకపాటి చర్చించినట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్దితులపైనా ఆయన లోకేష్ కు వివరించినట్లు తెలుస్తోంది.

Posted Under AP
YES9 TV