మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి కూడా రెడీ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇక నేడు వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుందని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఒక టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, లావణ్య త్రిపాఠి కానీ ఏమాత్రం స్పందించలేదు.
అయితే ఈ రోజు వీరిద్దరి నిశ్చితార్థ వేడుక చాలా ప్రైవేట్ గా, తక్కువ మందితో కూడిన ఈవెంట్ గా జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రోజు జరిగే నిశ్చితార్ధ వేడుకలోనే వివాహానికి ముహూర్తం కూడా నిర్ణయం చేయబోతున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్న వరుణ్ తేజ్ నివాసంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వార్తలకు తోడు తాజాగా మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించి పెళ్లి పత్రికపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వివాహానికి ఆహ్వానించేవారికి ఇవ్వడానికి రూపొందించే వెడ్డింగ్ కార్డ్ కోసం ఏకంగా 80వేల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు ఓ వార్త ప్రచారం అవుతోంది.
బంగారు పూత కల వెడ్డింగ్ కార్డును వివాహానికి ఆహ్వానించే ప్రముఖులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. వీరి పెళ్ళికి కూడా లిమిటెడ్ గానే ఆహ్వానితులు ఉంటారని తెలుస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి కూడా గతంలో నిహారిక పెళ్లి జరిగిన రాజస్థాన్‌లోని ఉదయఘడ్ ప్యాలెస్‌లోనే జరగనుందని కూడా చర్చ జరుగుతుంది. మరి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఈ రోజైనా వారిరువురి వివాహ వార్తలపై స్పందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
