న్యూజిలాండ్.. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) విజేత. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై కివీస్ గెలిచి తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది.
ఈ క్రమంలో న్యూజిలాండ్‌కు ఐసీసీ ఓ ‘గద’ను బహూకరించి భారీ ప్రైజ్‌మనీని అందించింది. సాధారణంగా మెగా టోర్నీల్లో గెలిచిన జట్టుకు కప్‌ను ఇవ్వడం ఆనవాయితీ. కానీ, వినూత్నంగా ‘గద’ను బహూకరించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ప్రారంభమైంది. ఈసారి కూడా టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకొచ్చి ఆసీస్‌తో తలపడుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాంపియన్‌గా నిలిచి ఈసారైనా భారత్ గదను దక్కించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ‘గద’ గురించి ఆసక్తికర విశేషాలు మరోసారి మీ కోసం..
అదే ఇది..
గతంలో టెస్టుల్లో అగ్రస్థానం దక్కించుకున్న జట్టుకు గదను బహూకరించేవారు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేతకు ఇస్తున్నారు. దీంతో పాటు గెలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ కూడా ఇస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు దక్కుతాయి. మరి ఇలాంటి ‘గద’ను ఐసీసీ 2000 సంవత్సరంలోనే తయారు చేయించింది. ట్రావెర్ బ్రౌన్ అనే డిజైనర్ దీనిని రూపొందించాడు. దీని తయారీ వెనుక ప్రేరేపించిన అంశాలను కూడా ఆయనే వెల్లడించాడు.
”ఇలాంటి డిజైన్‌ను రూపొందించడానికి నాకు స్ఫూర్తిగా నిలిచిన సంఘటన ఒకటుంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులు స్టంప్‌ను తీసుకుని సంబరాలు చేసుకోవడం చూశా. దీంతో స్టంప్‌ను ఆలంబనగా చేసుకుని గదను తయారు చేయడానికి స్ఫూర్తి పొందా”అని బ్రౌన్ వివరించాడు. క్రికెట్‌లో ప్రధానమైన బంతిని కేంద్ర బిందువుగా చేసుకొని గదను తయారు చేశాడు. ఇలా బంతి అమరిక టెస్ట్ క్రికెట్ ప్రపంచ స్థాయిని తెలియజేస్తుంది. గద హ్యాండిల్ క్రికెట్ స్టంప్‌ను సూచిస్తుంది. హ్యాండిల్ చుట్టూ రిబ్బన్ చుట్టి ఉంటుంది. ఈ రిబ్బన్‌ను విజయానికి చిహ్నంగా భావిస్తారు.
