ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో కొన్ని మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. ముఖం నలిగిపోవడంతోపాటు కాళ్లు, చేతులు తెగడంవల్ల కూడా మృతిచెందినవారి బంధువులు వాటిని గుర్తించలేకపోతున్నారు.
ఈ పరిస్థితిని కొందరు దురాశపరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పరిహారం సొమ్ము కొట్టేయడానికి నాటకాలు ఆడుతున్నారు. ఎవరూ గుర్తించని మృతులను తమ కుటుంబ సభ్యులుగా నమ్మించి మృతదేహాలు తీసుకువెళుతున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసం చోటుచేసుకుంటుండటంపై ఒడిసా ప్రభుత్వం అప్రమత్తమైంది. మోసానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
కటక్‌కు చెందిన గీతాంజలి దత్తా మృతులను ఉంచిన ప్రదేశానికి వచ్చి తన భర్త ఇదే రైల్లో ప్రయాణించారని, ఆచూకీ తెలియడంలేదని పోలీసులకు తెలిపింది.అక్కడున్న ఫొటోలను చూపించి ఆమె భర్త ఎవరో గుర్తించమని సూచించారు. కొన్ని ఫొటోలను చూసిన తర్వాత ఓ వ్యక్తి ఫొటో చూపించి అతడే తన భర్త అని తెలిపింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించారు. తన భర్త బతికేవున్నాడని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఇలా చేసినట్లు అంగీకరించింది.
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో రైల్వేబోర్డు అధికారులతో సమావేశమయ్యారు. ఒడిసా రైలు ప్రమాదంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. అనంతరం జనరల్ మేనేజర్లు, డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సిగ్నల్ వ్యవస్థలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
