ఏపీ మంత్రివర్గం భేటీ: జగన్ నిర్ణయాలపై ఉత్కంఠత

అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టనుంది.

అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది.

ఆరు నెలలుగా ముందుగానే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. ఇటీవలే హస్తిన సందర్భంగా వైఎస్ జగన్ ఇదే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వద్ద కూడా ప్రస్తావించారనే ప్రచారం కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే.

ఈ పరిణామాల మధ్య ఇవ్వాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. వైఎస్‌ జగన్‌ దీనికి అధ్యక్షత వహించనున్నారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ ఇదివరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 5వ తేదీ మధ్యాహ్నానికే ఆయా ప్రతిపాదనలన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.

Posted Under AP
YES9 TV