Latest Posts

వైఎస్ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సీబీఐ..

అక్కడే కస్టడీ విచారణ కూడా చేస్తోంది. అలాగే మరికొందరు అనుమానితుల్ని, నిందితుల్ని లోతుగా విచారిస్తోంది. ఇదే క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ మరోసారి ప్రశ్నించింది.

తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు తర్వాత తొలిసారి వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఇవాళ హైదరాబాద్ లో విచారించింది. ఇప్పటివరకూ సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపిన అవినాష్.. ఇవాళ మాత్రం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందులో వివేకా హత్య జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపైనే ప్రశ్నించినట్లు సమాచారం.

వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు రాత్రి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పలువురితో వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ హైకోర్టుకు కూడా తెలిపింది. కానీ వాటి డేటాను వెలికితీసే అవకాశం లేదు. దీంతో సదరు వాట్సాప్ కాల్స్ ఎవరితో మాట్లాడారన్న దానిపై ఇవాళ అవినాష్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సీబీఐ దర్యాప్తులో అవే కీలకంగా మారిపోయాయి.

Posted Under AP
YES9 TV