హైదరాబాద్: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటికీ- దీన్ని స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు రావట్లేదు.
రూ.2,000 నోటు రద్దయిందని, అది చెల్లదంటూ స్పష్టం చేస్తోన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ- వారు పట్టించుకోవట్లేదు. దీనితో కొనుగోలుదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంక్ దాకా వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుందనే కారణంతో వాటిని రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తోన్నారు. అటు పెట్రోల్ బంకుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2,000 రూపాయల డినామినేషన్ నోట్లను తీసుకోవడానికి అక్కడి సిబ్బంది ఏ మాత్రం అంగీకరించట్లేదు.
బ్యాంకులకు వెళ్లి నోట్లను మార్పిడి చేసుకోవడం పట్ల పెద్దగా ఆసక్తి లేనివారు, అక్కడ చాంతాడంత క్యూలో నిల్చోవడం ఇష్టం లేని వారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని చలామణి చేస్తోన్నారు. ఇందులో భాగంగా- నోట్ల మార్పిడి కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పైనా ఆధారపడుతున్నారు. ఇది కాస్తా ఆయా కంపెనీలకు ఇక్కట్లను తెచ్చిపెడుతోంది. పోటెత్తుతున్న 2,000 రూపాయల నోట్లను చూసి తలపట్టుకుంటోన్నాయి.
2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి ఏర్పడిందని జొమాటో మేనేజ్‌మెంట్ తెలిపింది. శుక్రవారం నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 72 శాతం మేర తమ ఆర్థిక లావాదేవీలు, క్యాష్ ఆన్ డెలివరీలన్నీ 2,000 రూపాయల నోట్ల మీదే నమోదయ్యాయని తెలిపింది.
ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. రూ.2,000 నోట్లపై ఓ వ్యక్తి పడుకున్న ఫొటోను దీనికి జత చేసింది. అక్కడితో ఆగలేదు. సరదాగా మరో ట్వీట్ వేసింది. బ్యాంక్‌కు వెళ్లి రూ.2,000 నోట్లను మార్చుకోవాలని పిల్లలు తమ ఇంట్లోని పెద్దలకు సూచించగా వారు- ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆ నోటును డెలివరీ బాయ్ చేతిలో పెడితే సరిపోతుందని చెబుతున్నట్లు పేర్కొంది. తమ వద్ద రూ.2,000 నోటే లేదని లెజెండ్స్ ఫీల్ అవుతారని సెటైర్స్ వేసింది.
