Latest Posts

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 52 మ్యాచ్ లు ముగిసే సమయానికే చేజింగ్ లో సరికొత్త రికార్డు

పీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 52 మ్యాచ్ లు ముగిసే సమయానికే చేజింగ్ లో సరికొత్త రికార్డు నమోదయ్యింది.

ఐపీఎల్ గత 15 సీజన్లకు భిన్నంగా ప్రస్తుత 16వ సీజన్ లో రికార్డుల మోత మోగుతోంది.

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన పుణ్యమా అంటూ 200కు పైగా స్కోర్లు సాధించడం ఎంతో తేలికో..200కు పైగా లక్ష్యాలను చేధించడం కూడా అంత సునాయాసంగా మారింది.

మొత్తం 10 జట్ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లోని 70కి మొదటి 52 ( రాజస్థాన్- హైదరాబాద్ )మ్యాచ్ లు ముగిసే సమయానికే ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది.

ప్రస్తుతసీజన్ లీగ్ లో మరో 18 మ్యాచ్ లు మాత్రమే మిగిలిఉండగా ఇప్పటికే ఆరుసార్లు 200కు పైగా స్కోర్ల లక్ష్యాన్ని అధిగమించడం ద్వారా వివిధజట్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి.

గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైన లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ పైన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 200కు పైగా లక్ష్యాలను అలవోకగా చేధించి సంచలన విజయాలు నమోదు చేశాయి.

మొత్తం ఆరుమ్యాచ్ ల్లో నాలుగుమ్యాచ్ ల ఫలితం చివరి బంతిలో తేలింది. ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ రెండుసార్లు 200కు పైగా లక్ష్యాలను చేధించిన జట్టుగా నిలిస్తే..200కు పైగా లక్ష్యాలను రెండుసార్లు కాపాడుకోడంలో విఫలమైన జట్టుగా మరో మాజీ విజేత రాజస్థాన్ రాయల్స్ నిలిచింది.

ప్రస్తుత సీజన్లో అతిపెద్ద ( 215 పరుగుల )లక్ష్యం చేధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

ఐపీఎల్ మొత్తం 16 సీజన్ల ( 2008 – 2023 ) చరిత్రలో 21సార్లు 200కు పైగా లక్ష్యాలను వివిధజట్లు చేధించగలిగాయి. రాజస్థాన్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ సాధించిన ఆఖరి బంతి చేజింగ్ విజయంతో రికార్డు సంఖ్య 21కి చేరింది.

అంతేకాదు..మొత్తం 60సార్లు వివిధజట్లు కలసి ఓ మ్యాచ్ లో 400కు పైగా స్కోర్లు నమోదు చేయడం మరో రికార్డుగా మిగిలిపోతుంది. ప్రస్తుత 16వ సీజన్లో ఇప్పటికే 12సార్లు 400కు పైగా స్కోర్లు నమోదయ్యాయి.

YES9 TV