Latest Posts

బాలీవుడ్,కోలీవుడ్ ఏంటి?.. ఇండియన్ సినిమా అనొచ్చుగా!

ప్రస్తుతం సినిమాలు ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా ఆడుతున్నాయి. కథ నచ్చితే ఏ భాషా ప్రేక్షకులైన హిట్ చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ‘కార్తికేయ -2’ కన్నడ సూపర్ హిట్ ‘కాంతారా’, తమిళ సినిమా ‘లవ్ టుడే’ పరభాషలోనూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.

పలు బాలీవుడ్ చిత్రాలు సైతం మిగిలిన భాషల్లో అలరించాయి. ఇలా భాషతో సంబంధం లేకుండా ఆడుతూ భారతీయ చలనచిత్ర రంగ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఇలాంటి సమయంలో కొందరు సినీ ప్రముఖులు తమది బాలీవుడ్ అని చెప్పుకోవడాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం( Mani Rathnam) ఆక్షేపించారు. అలా చెప్పుకోవడం వల్ల ఇండియన్ సినిమాకి సరైన గౌరవం దక్కదని అభిప్రాయపడ్డారు. చెన్నై లో ఏర్పాటు చేసిన చర్చ వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

‘ హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళని చాలామందిని గమనించాను. వాళ్ళందరూ బాలీవుడ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళది మానేయాలి. అప్పుడే ఇండియన్ సినిమాకు మంచి గుర్తింపు వస్తుంది. నాకు వ్యక్తిగతంగా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ వంటి మాటలు నచ్చవు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరు పెట్టుకోవడం వల్ల ఇండియన్ సినిమా కు ప్రపంచ వేదికపై సరైన గుర్తింపు రాదనేది నా అభిప్రాయం. ఏ భాషలో వచ్చిన దాన్ని ఇండియన్ సినిమాగానే పరిగణించాలి. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు ప్రపంచ సినీ వేదికపై ప్రభావం చూపుతున్నాయి. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం’ అని అన్నారు.

మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28న విడుదల కు సిద్ధమైంది. విక్రం( Vikram), కార్తీ( Karthee), జయం రవి( Jayam Ravi) , త్రిష(Thrish, ఐశ్వర్యారాయ్( Aishwarya Rai) వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కనిపించనుంది. ‘పొన్నియిన్ సెల్వన్-1’ తమిళంలో సూపర్ హిట్ అందుకోవడంతో దీని సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

YES9 TV