Latest Posts

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారాన్ని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. కర్ణాటకలోని కోలార్‌(Kolar)లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ఆదివారం ప్రసంగించారు.

“మోదీ ఇంటిపేరు”పై 2019లో ఇక్కడ చేసిన వ్యాఖ్యల కారణంగానే పరువు నష్టం కేసులో ఇటీవలే దోషిగా తేలి.. ఎంపీ పదవిని కోల్పోయారు రాహుల్. ఇప్పుడు, కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని కోలార్‌లోనే మొదలుపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. విమర్శలు కురిపించారు. కులాల ఆధారంగా జనాభా లెక్కలను వెల్లడించారని కేంద్రాన్ని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ కంపెనీ విషయంలో మరోసారి ఆరోపణలు చేశారు.

ఆ గణాంకాలను వెల్లడించండి

Rahul Gandhi: 2011లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన కులాల వారీగా జనాభా లెక్కలను.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ గణాంకాలు వెల్లడిస్తే.. జనాభా మేరకు ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు రాజకీయాల్లో ప్రస్తుతం తగిన మేర ప్రాతినిధ్యం ఉందో లేదో తెలిసిపోతుందని అన్నారు. ఓబీసీల గురించి మాట్లాడుతున్న వారు ఈ లెక్కలను స్పష్టం చేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్‍టీల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాహుల్.

అవినీతికి అదానీ ఓ సింబల్

Rahul Gandhi: ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ మధ్య సన్నిహిత బంధం ఉందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. అవినీతికి అదానీ ఓ చిహ్నంగా ఉన్నారని విమర్శించారు. “ప్రధానీ మోదీ.. మీరు అదానీకి వేల కోట్ల రూపాయాలు ఇవ్వగలిగారు. మేం కర్ణాటకలోని పేదలు, మహిళలు, యువత ఇవ్వగలం. మీరు అదానీకి హృదయపూర్వకంగా సహకరించారు. మేం కర్ణాకటలోని పేదలకు మనస్ఫూర్తిగా సాయం చేస్తాం” అని రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వమే అడ్డుతగిలిందని, చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని రాహుల్ గాంధీ అన్నారు.

హామీల వర్షం

Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని వెల్లడించారు. గృహజ్యోతి పథకం కింద ప్రతీ నెలా పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.2వేలు, అన్న భాగ్య పేరుతో కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి నెలకు 10కేజీల బియ్యం, యువ నిధి కింద నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.3వేలు ఇస్తామని హామీలు ఇచ్చారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుంది. 15వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉండగా.. మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

YES9 TV