తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడం, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఏర్పడింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. టోకెన్ లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 నుంచి 32 గంటల సమయం పడుతోంది.
శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 31,980 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మేలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోన్నారు.
శ్రీవారి దర్శనం కోసం కాలినడకన అలిపిరి నుంచి తిరుమల చేరుకునే భక్తుల కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్ల జారీని టీటీడీ అధికారులు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు 8,000 దివ్య దర్శన టోకెన్లను కూడా విడుదల చేశారు. అవి పూర్తి కాగా మిగిలిన భక్తులకు మరో 4,000 మంది భక్తుల కోసం టోకెన్లు విడతల వారీగా జారీ చేశారు.
డీఎల్ రవీంద్రా రెడ్డికి టీడీపీ స్క్రిప్ట్: మాజీ మంత్రి
ఇదిలావుండగా- శ్రీవారి భక్తులను మోసాలకు గురి చేస్తోన్న వెబ్‌సైట్లపై టీటీడీ అధికారులు కొరడా ఝుళిపించారు. వాటిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా వెబ్‌సైట్లకు నోటీసులను జారీ చేస్తోన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం టికెట్లు, వసతి గదుల కేటాయింపు, టీటీడీలో ఉద్యోగాల కల్పన.. వంటి మోసాలకు ఆయా వెబ్‌సైట్లు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
అనధికారికంగా 300 రూపాయలకు సంబంధించిన నకిలీ టికెట్లను జారీ చేయడం, భక్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదును సేకరించడం, వసతి గదుల కేటాయింపుతో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తోండటం వంటి మోసపూరిత కార్యకలాపాలకు ఆయా వెబ్‌సైట్లు పాల్పడుతున్నాయని, అందుకే వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తెలిపారు.
శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులు, ఇ-హుండీ కానుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ వెబ్‌సైట్ల బారిన పడొద్దని సూచించారు. అలాంటి నకిలీ వెబ్‌సైట్లు 40 వరకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ 40 వెబ్‌సైట్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన వివరించారు.
