విపక్షాల అనైక్యతే అధికార పార్టీ బలం.! ఇది రాజకీయాల్లో చాలా సర్వసాధారణమైన ఈక్వేషన్.! అందుకే, విపక్షాలన్నీ ఐక్యంగా వుండి అధికారంలో వున్నవారిపై పోరాటం చేస్తుంటాయి.
వామపక్షాలు పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, ప్రధాన పార్టీల గెలుపోటముల్ని ఒకప్పుడు అందుకే శాసించేవి తెలుగు రాష్ట్రాల్లో.
కానీ, ఇప్పుడు వామపక్షాలకు అంత సీన్ లేదు. ఏదో రాజకీయ పార్టీ విమర్శించదని కాదుగానీ, వామపక్షాలంటే తోక పార్టీలుగా మారిపోయాయ్.! తెలుగు రాష్ట్రాల్లో, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, వామపక్షాల ప్రభావం అస్సలు లేకుండా పోయింది.
పోటీ ఇప్పుడు ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన – బీజేపీ మధ్యే.! వైసీపీ అధికారంలో వుంది. జనసేన – బీజేపీ పొత్తులో వున్నాయి. ఆ జనసేన – బీజేపీ కూటమిలోకి టీడీపీ వస్తుందా.? రాదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని జనసేన అధినేత చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. వైసీపీ సంగతి సరే సరి. ‘అమ్ముడు పోయారు, దత్త పుత్రుడు..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద అర్థం పర్థం లేని విమర్శలు చేయడానికి వైసీపీ ఇదొక అవకాశంగా తీసుకుంది.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని పవన్ కళ్యాణ్ అంటోంటే, వైసీపీ ఎందుకు ఉలిక్కిపడాలి.? ‘వై నాట్ 175’ అని అంటోంది వైసీపీ. 85 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు వెళ్ళాయనీ వైసీపీ చెబుతోంది. అలాంటప్పుడు, ప్రభుత్వ వ్యతిరేకత కేవలం 15 శాతమే వుండాలి కదా.! ఆ పదిహేను శాతం గంపగుత్తగా జనసేనకు పడినా, టీడీపీకి పడినా, ఇంకే పార్టీకి పడినా, వైసీపీకి వచ్చే నష్టమేముంది.?
అంటే, వైసీపీ వ్యతిరేక ఓటు విషయంలో వైసీపీనే చాలా భయపడుతోందన్నమాట. ఆ వ్యతిరేకత 15 శాతం కాదు.. 85 శాతం అని వైసీపీ భావిస్తోందన్నమాట. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అని పవన్ కళ్యాణ్ అంటున్నారంటే.. అదంతా, జనసేన వైపుకు తీసుకొస్తానని ఆయన చెబుతున్నట్లుగా ఎందుకు భావించకూడదు.?
