Latest Posts

షర్మిలక్క ఇదేం పద్ధతి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Raja Sekhar Reddy)రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు.

ఆయన వారసులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy)వైయస్సార్ సిపిలో, వైయస్ షర్మిల( YS Sharmila) వైయస్సార్ తెలంగాణ పార్టీలో కొనసాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడితే.. షర్మిల మాత్రం రాజకీయాల కంటే ఆమె మాట తీరుతోనే ఎక్కువ గా వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ‘పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేయాత్ర’ అంటూ చేసిన వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియా రీల్స్ కంటెంట్ గా మారిపోయాయి. ఆ తర్వాత ‘ఆడపిల్ల ని ఆడపిల్ల అని ఎందుకు అంటారు తెలుసా?’ అని వివరించిన తీరు ఎవరికైనా నవ్వు తెప్పించక మానదు.

తమ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి సమర్ధంగా తీసుకెళ్లిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. అలాంటి నాయకుడికే ప్రజలు కూడా పట్టం కడతారు. షర్మిల పార్టీ అజెండా సంగతి దేవుడెరుగు.. తెలంగాణలోని అధికార పార్టీ పై విమర్శలు చేసే క్రమంలో అసలు తానో రాజకీయ నాయకురాలన్న సంగతి చాలాసార్లు మర్చిపోయినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్( BRS) పార్టీ పై పోరు ప్రకటించేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి తాజాగా షర్మిల వామపక్షాల మద్దతు కోరారు.

ఇందులో భాగంగా సిపిఎం( CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram) తో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. అయితే ఎక్కడుందన్న సోయ కూడా లేకుండా వీరభద్రం ముందే సిపిఎం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తో సిపిఎం చీకటి ఒప్పందం పెట్టుకుందని ఆరోపించారు. ‘ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు వామపక్షాలు నన్ను ఎప్పుడైనా పిలిచాయా?. ఎంతసేపు బిజెపికి బీ టీం అనడం తప్ప.. ఏనాడైనా ఫోన్ చేసి రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారా? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అయితే అక్కడే ఉన్న వీరభద్రం షర్మిల మాటలకు నివ్వెర పోయారు. తమకు సంస్కారం ఉందని ప్రజా సమస్యలపై పోరాడాలి..పార్టీ కార్యాలయానికి వస్తానంటే ఆహ్వానించానని అన్నారు. తామిచ్చిన మర్యాదని షర్మిల నిలబెట్టుకోలేదని ఆగ్రహించారు. తమను పక్కనే పెట్టుకొని తమ పార్టీపైనే షర్మిల విమర్శలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో అధికార పార్టీకి బహిరంగంగానే మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే..ఈ పరిణామం తో షర్మిల మరోసారి తన రాజకీయ అపరిపక్వత చాటుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

YES9 TV