దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ సంగీతంపై సోషల్ మీడియాలో వస్తున్న భిన్నమైన అభిప్రాయాలు, విమర్శలపై ఆస్కార్ అవార్డు గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఆన్లైన్లో వచ్చే ఫీడ్బ్యాక్ల కంటే తన పనిలో చూపించే నిబద్ధత, నిజాయతీలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక పాటను సిద్ధం చేసే ప్రక్రియలో ఎంతో తీవ్రమైన కసరత్తు, ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయని, తుదిరూపు వచ్చేవరకు శ్రమించాక ఇక బయట ఎవరు ఏమంటున్నారో అనే ఫీడ్బ్యాక్లు చూసే ఓపిక కూడా తనకు ఉండదని స్పష్టం చేశారు. నా పనిని మనస్ఫూర్తిగా చేశానని, ప్రేక్షకులు కచ్చితంగా దీన్ని ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాటను అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించగా, ఇది సూఫీ లేదా ఖవ్వాలీ శైలిలో సాగిందని, రామాయణ ఇతిహాస నేపథ్యానికి తగినట్లుగా లేదంటూ నెటిజన్లలో కొంత చర్చ జరిగింది. దీనిపై స్పందించిన సినీ వర్గాలు.. గతంలో విడుదలైన ‘రావణ తాండవ్’ పాటకు కూడా తొలుత ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలే ఎదురైనప్పటికీ, క్రమంగా అది సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుందని గుర్తుచేశాయి. మూడు దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఇలాంటి అద్భుత ఇతిహాస కథకు సంగీతం సమకూర్చడాన్ని ఒక గొప్ప బాధ్యతగా, దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రెహమాన్ తెలిపారు.
ఈ దృశ్యకావ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో హాలీవుడ్ ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్తో (Hans Zimmer) కలిసి తాను పనిచేస్తున్నట్లు రెహమాన్ వెల్లడించారు. వీరిద్దరి కలయిక సినిమా నేపథ్య సంగీతాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లనుంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
