Latest Posts

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మంత్రి నారా లోకేశ్ భేటీ: మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మలతో ఘన సత్కారం!

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ పర్యటనలో భాగంగా నగరంలోని నోవోటెల్ హోటల్‌లో బస చేసిన రాష్ట్రపతిని ఆయన ప్రత్యేకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు, మహిళా స్వయం సహాయక బృందాల సాధికారత కోసం ఏర్పాటు చేసిన ‘జాతీయ సరస్ మేళా’ను ప్రారంభించేందుకు విచ్చేసినందుకు రాష్ట్రపతికి లోకేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్రపతిని మంత్రి నారా లోకేశ్ శాలువాతో సత్కరించి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి, చేనేత కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ మంగళగిరి చేనేత చీరను ఆమెకు కానుకగా బహూకరించారు. దీనితో పాటు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన, తెలుగు కళాకారుల హస్తకళా నైపుణ్యానికి దర్పణం పట్టే సాంప్రదాయ ఏటికొప్పాక లక్క బొమ్మలను రాష్ట్రపతికి బహుమతిగా సమర్పించారు.
మన ప్రాచీన సంస్కృతి, స్థానిక కళాకారుల వారసత్వ కళలకు ఈ కానుకలు నిదర్శనమని, దేశ ప్రథమ పౌరురాలికి వీటిని బహూకరించడం ఎంతో గర్వకారణమని నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఫొటోలను పంచుకున్నారు.
Posted Under AP
Editor