Latest Posts

ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం కసరత్తు.. మద్దతు కోసం డీఎంకేతో చర్చలు!

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈ కీలక రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో, ఈసారి ఎలాగైనా నెగ్గించుకోవాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. మరోవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ అంశాలపై ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న తరుణంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం.
రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి కావడంతో కేంద్రం సంఖ్యాబలంపై పూర్తి దృష్టి సారించింది. ప్రస్తుతం లోక్‌సభలోని 540 మంది సభ్యులలో బిల్లు పాస్ కావడానికి సుమారు 360 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. ఎన్డీయేకు సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రత్యేక మెజారిటీని సాధించేందుకు వీలుగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీల మద్దతు తమకు లభించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఓటింగ్‌ సమయంలోనే తుది బలాబలాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఈ బిల్లులకు అవసరమైన సంపూర్ణ మద్దతు కూడగట్టే క్రమంలో డీఎంకే సహా పలు చిన్న ప్రతిపక్ష పార్టీలతోనూ కేంద్ర పెద్దలు చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో విభేదాల కారణంగా ఇండియా కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీతో జరుగుతున్న సంప్రదింపులకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఆగస్టు 13న ముగిసిన వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ప్రొరోగ్ కాకపోవడంతో, అక్టోబర్‌ 26, 27 తేదీల్లో జరిగే 12వ బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరమ్‌ను దృష్టిలో ఉంచుకుని వారం రోజుల ముందు నోటీసు ఇచ్చి ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Editor