బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన సినీ ప్రయాణం తొలినాళ్లలో ఎదురైన అత్యంత కఠినమైన, భావోద్వేగభరితమైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం ‘రబ్ నే బనా ది జోడీ’ ఆడిషన్స్ సమయాన ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగా కలచివేశాయో గతంలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో వెల్లడించారు. తన కార్యాలయంలో కూర్చుని మాట్లాడిన ఆదిత్య చోప్రా.. ఆమె ప్రతిభపై పూర్తి నమ్మకముందని, మంచి నటి అని ప్రశంసిస్తూనే, “చూడటానికి నువ్వు అంత అందంగా ఉండవు.. అందుకే మిగిలిన వారి కంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది” అని నిక్కచ్చిగా మొహం మీదే చెప్పినట్లు అనుష్క తెలిపారు.
ఆదిత్య చోప్రా ఆ మాటలు చెప్పిన సమయంలో తాను ఆఫీస్ లో సాధారణంగానే ఉండి, ఆయనకు ధన్యవాదాలు తెలిపి బయటకు వచ్చేశానని అనుష్క పేర్కొన్నారు. అయితే బయటకు వచ్చి కారు ఎక్కిన కొద్దిసేపటికే భావోద్వేగాలను నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని, దారి మధ్యలోనే కారు ఆపి మరీ ఏడ్చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడంతో, వెంటనే తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెబుతూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నాటి బాధాకరమైన క్షణాలను ఆమె పంచుకున్నారు.
ఆదిత్య చోప్రాను కలవక ముందు వరకు తనను తాను చాలా అందగత్తెనని భావించేదాన్నని, అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత పెళ్లికూతురు దుస్తుల్లో మానిటర్పై తనను తాను మొదటిసారి చూసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నిజమేననిపించిందని అనుష్క నిజాయితీగా అంగీకరించారు. మొదటి సినిమా కంటే ముందు ఎన్నో ఆడిషన్లలో ఘోరమైన తిరస్కరణలను ఎదుర్కొన్నప్పటికీ, తన స్వయంకృషి, ప్రతిభనే నమ్ముకుని కష్టపడి బాలీవుడ్లో అగ్ర కథానాయికలలో ఒకరిగా నిలిచానని ఆమె వివరించారు.
