దేశంలోని పలు విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాన్ని తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంతో జతచేస్తూ (బండ్లింగ్ విధానం) ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EoI) జారీ చేసింది. తక్కువ వాణిజ్య రాబడి లేదా తక్కువ రద్దీ ఉండే ఎయిర్‌పోర్టును అధిక రాకపోకలు సాగించే విమానాశ్రయంతో కలిపి ఒకే ప్యాకేజీగా అందించడం ద్వారా, నిర్వహణ మరియు ఆధునికీకరణ పనుల్లో ప్రైవేట్ సంస్థలను సమర్థవంతంగా ఆకర్షించడమే ఈ బండ్లింగ్ విధానం ముఖ్య ఉద్దేశం.
ఈ బండ్లింగ్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 విమానాశ్రయాల అభివృద్ధి కోసం సుమారు 8,622 కోట్ల రూపాయల మేర ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి నిరంతరం తరలివచ్చే భక్తులు, పర్యాటకుల వల్ల తిరుపతి విమానాశ్రయంలో రద్దీ నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాలకు ఇక్కడి నుంచి రాకపోకలు సాగుతుండగా.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెర్మినల్ విస్తరణ, రన్‌వే సౌకర్యాలు, రిటైల్ మరియు కార్గో వంటి నాన్-ఏరోనాటికల్ ఆదాయ మార్గాలను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. తిరుపతితో పాటు భవిష్యత్తులో ఏపీలోని రాజమండ్రి, కడప విమానాశ్రయాలను కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
ప్రైవేటీకరణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ విమానాశ్రయాల పూర్తి యాజమాన్య హక్కులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్దే కొనసాగుతాయి. నిర్ణీత లీజు కాలానికి మాత్రమే సమగ్ర నిర్వహణ, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేట్ డెవలపర్లకు అప్పగిస్తారు. అంతేకాకుండా లీజు నిబంధనల ప్రకారం తొలి మూడేళ్ల కాలంలో ప్రస్తుత ఏఏఐ సిబ్బందిలో కనీసం 60 శాతం మందిని కొనసాగించాలనే స్పష్టమైన రక్షణ నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బిడ్డింగ్ దశకు చేరిన ఈ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ సంస్థల పెట్టుబడులతో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
